విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా, ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ స్పోర్ట్స్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘గట్ట కుస్తీ 2’ (Gatta Kusthi 2). బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా జూలై 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
2022లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘గట్ట కుస్తీ’ (తెలుగులో ఈ సినిమా ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi) పేరుతో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే)కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు చెల్లా అయ్యవు (Chella Ayyavu) ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహించారు. జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, విష్ణు విశాల్ కెరీర్‌లో తొలి రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
మొదటి భాగంలో భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) కుస్తీ కలలను వీర (విష్ణు విశాల్) ఎలా అడ్డుకున్నాడు, ఆ తర్వాత ఎలా మార్పు చెందాడు అనే కోణంలో కథ సాగుతుంది. ఇక సీక్వెల్‌లో వీర ఇచ్చిన మాట ప్రకారం కీర్తి రెస్లింగ్ కెరీర్‌కు సపోర్ట్ చేస్తూ హౌస్ హస్బండ్‌గా మారుతాడు. అయితే, వారి కూతురు మతి మలార్ భవిష్యత్తు మరియు పెంచే విషయంలో వచ్చే అభిప్రాయ భేదాలు వారి కాపురంలో చిచ్చు పెడతాయి. దీంతో కీర్తి తన కెరీర్‌ను పణంగా పెట్టాల్సి వస్తుంది. చివరికి వారి వైవాహిక జీవితం ఏమైంది, ఈ దంపతులు తమ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా కథాంశం.
ఈ చిత్రంలో కాళీ వెంకట్, కరుణాస్, మునిష్కాంత్, లిజీ ఆంటోని, గజరాజ్ తదితరులు తమ పాత పాత్రలను రిపీట్ చేయగా… రమ్యకృష్ణ మరియు యోగి బాబు ఈ సీక్వెల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీఎస్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి స్వయంగా విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన ప్రేక్షకులు, జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపీగా వీక్షించవచ్చు!
